ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కొత్త అభ్యర్థి పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మధ్యేమార్గంగా మాజీ ఎంపీ ఆర్.సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మొదటి నుంచి ఆర్.సురేందర్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌తోనే ఉండడం, రఘురామిరెడ్డి పొంగులేటి వియ్యంకుడు కావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం సమయానికి ఎలాంటి మార్పులు జరగకుంటే రఘురామిరెడ్డి పేరే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇక వరంగల్ నుంచి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఓ మాజీ మంత్రిని పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లోక్‌సభ స్థానం విషయంలో పార్టీ విధేయులనే ఎంపిక చేయనుంది కాంగ్రెస్.