భానుడి భగభగలతో తెలంగాణ అట్టుడుకుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తారుగా వర్షం పడుతోంది. ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు చిరు జల్లులతో ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్ విభాగం చల్లని కబురు చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఆదివారం రోజున ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
సోమవారం రోజున ఆదిలాబాద్, నిర్మల్, కుముంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. హైదరాబాద్‌లో మాత్రం కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది.