స్పీడ్ పేరుతో కొత్త కార్యాచరణ చేపట్టిన సీఎం రేవంత్..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంది. స్పీడ్.. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో కొత్త కార్యాచరణ చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, పనులను స్పీడ్ పరిధిలో చేర్చారు. రేవంత్ రెడ్డి వీటిని స్వయంగా సమీక్షిస్తారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమవుతారు.

రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ ప్రదర్శిస్తుంది. ఆలస్యం జరగకుండా నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. పట్టణాలకే పరిమితం కాకుండా… అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై స్పీడ్ దృష్టి కేంద్రీకరిస్తుంది. స్పీడ్ కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిర్ణీత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటివరకు ఏయే పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను ప్రస్తావిస్తారు. ఇక స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తుంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్ డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version