ఫార్మాసిటీ కోసం 2020లో వెలువడిన భూసేకరణ ప్రక్రియ పరిహార ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన పరిహార డిక్లరేషన్‌ను నిలిపేసింది. భూసేకరణ ప్రక్రియను మొదటి నుంచి కాకుండా పిటిషనర్ల అభ్యంతరాల దశ నుంచి కొనసాగించవచ్చని పేర్కొంది. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 15(2), సెక్షన్ 16 నుంచి 18 వరకున్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
పిటిషనర్లు కూడా తమ అభ్యంతరాలను రెండు వారాల్లో భూసేకరణ అధికారికి సమర్పించాలని, వీటిపై నివేదికను భూసేకరణ అధికారి… కలెక్టర్‌కు సమర్పించాలని తెలిపింది. భూమి మార్కెట్ విలువను ప్రాథమిక నోటిఫికేషన్ వెలువరించిన తేదీని కాకుండా తీర్పు వెలువరించిన తేదీని పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని నిర్ణయించాలని స్పష్టం చేసింది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియలో 2013 నాటి భూసేకరణ చట్టం, పునరావాసాలకు సంబంధించి పారదర్శకతను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ, భూసేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ మేడిపల్లి, కుర్మిద్ద గ్రామస్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై వాదనలను విన్న హైకోర్టుభూసేకరణ చట్టాన్ని అర్థం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ పరిహార ఉత్తర్వులు రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.