రాష్ట్రంలో లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల నమూనా పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం అయిదున్నర గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈవీఎంల మొరాయింపు వంటి సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిచేసేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ముగ్గురు ఈసీఐఎల్ ఇంజినీర్లను నియమించారు. నమూనా పోలింగ్ ముగిసిన తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. తీవ్రవాద ప్రాబల్యమున్న 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు కొనసాగనుంది.
రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా.. 285 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది పోటీలో ఉండగా.. అతితక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యాన్ని 3 కోట్ల 32 లక్షల 32 వేల 318 మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.