తెలంగాణలో ఓవైపు సూర్యుడి భగభగలు మండుతూనే మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడ్రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. రేపు రుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో ఇవాళ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరి కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేణ 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
గురువారం రోజున హైదరాబాద్లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని మాల్కాజిగిరి, కాప్రాలోని ఈసీఐఎల్, కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి పరిసర ప్రాంతాలలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. నాగారం పురపాలక పరిధిలో ఉరుములు మెరుపులు కూడిన వర్షం పడగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.