రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి వెళ్లి వచ్చి వివిధ విభాగాధిపతుల్లో పని చేస్తున్న 148 మంది ఉద్యోగులను తిరిగి సచివాలయం విధుల్లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఈ మేరకు సంబంధిత ఫైల్పైన సీఎం రేవంత్ సంతకం చేశారు. ఉమ్మడి సచివాలయంలోని 148 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులను రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన విషయం తెలిసిందే.
అయితే ఆ ఉద్యోగులు తమను సొంత రాష్ట్రంలోకి తీసుకోవాలని అభ్యర్థించగా వారి అభ్యర్థనను 2018లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అంగీకరించాయి. దీంతో తెలంగాణకు తిరిగి వచ్చినా సచివాలయంలో ఖాళీలు లేవంటూ వివిధ విభాగ అధిపతుల కార్యాలయాల్లో వారికి విధులను కేటాయించారు. సచివాలయంలో తమ పూర్వ విధుల్లోనే తమను తీసుకోవాలని ఆ ఉద్యోగులు కొంతకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అభ్యర్థనను అంగీకరించిన సీఎం రేవంత్ రెడ్డి వారిని తిరిగి సచివాలయంలో విధుల్లోకి తీసుకున్నారు. తమ వినతిపట్ల సానుకూలంగా స్పందించి సంతకం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, సీఎస్ శాంతికుమారికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.