తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుతాయని ప్రకటించారు. మే 30వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 5, 6వ తేదీల్లో రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఎండ దంచికొడుతోంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటితే ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక రాత్రిపూట కూడా ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో శనివారం రోజున చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం కూడా ఆదిలాబాద్, మంచిర్యాలలో 45 డిగ్రీలు కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.