తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఠాక్రే మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖరారైందని, వీరి బాటలోనే బిజెపి నేతలు ఈటల రాజేందర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతితో చర్చలు జరుగుతున్నాయని ఠాక్రే, సహ ఇంచార్జ్ రోహిత్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు విజయశాంతి. ఠాక్రేకు మతిభ్రమించిందని.. అందుకే విజయశాంతితో చర్చలు అంటూ లీకులు ఇస్తూ అవాస్తవాలు మాట్లాడడం పిచ్చివాగుడు అవుతుందని అన్నారు.
క్షమాపణ చెప్పడం కనీస బాధ్యత అని ట్వీట్ చేశారు విజయశాంతి. ఇక మరోవైపు మోడీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం లోని మూసాపేట్ డివిజన్లో ఇంటింటికి బిజెపి భరోసా యాత్ర పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు విజయశాంతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన నేతలను తమలో విలీనం చేసుకునే దిశగా వ్యూహాలు పన్నుతున్నాడని విమర్శించారు.