తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా బొందపెట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాటలకు చేతలకు సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. అటుకులు బుక్కి ఉపాసమున్న కేసీఆర్ పదేళ్ల కాలంలో లక్షల కోట్ల అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అకౌంట్ లో రూ.850 కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.30 కోట్ల వరకు నిలువ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో దళిత జనాభా 17 శాతం వారిని వదిలేసి 0.6 శాతం ఉన్న వారికి కీలక మంత్రి పదువులు ఇచ్చారని పేర్కొన్నారు. 11 శాతం ఉన్న ముదిరాజ్ లకు బీఆర్ఎస్ లో ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు లే బాగుపడుతారని.. బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుడు సీఎం అవుతారని పేర్కొన్నారు. టీ అమ్ముకునే వ్యక్తిని ప్రధానిని చేసిన చరిత్ర బీజేపీది అని గుర్తు చేశారు మంత్రి ఈటల.