హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో వరద పోటెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాలు నీటమునిగాయి. పలుచోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలోని పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతంలోనికాలనీ సుఖ్ నివాస్ అపార్టుమెంట్ వద్ద పిడుగు పడింది. షెడ్డుపై పిడుగు పడటంతో కారు ధ్వంసం అయింది. మరోవైపు ఈ ఘటనలో విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అయితే పిడుగుపడిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
మరోవైపు నగరంలో భారీ వర్షాలు కురవడంతో పార్సిగుట్టలో రోడ్లు చెరువుల్లా మారాయి. మోకాళ్ల లోతు నీటిలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు అతణ్ని కాపాడారు. మరోవైపు పార్సిగుట్టలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి కార్లు కొట్టుకుపోయాయి. భారీ వరదతో ప్రమాద అంచుల్లో పార్సిగుట్టలోని పలు ప్రాంతాలు ఉన్నాయి. ముషీరాబాద్, రామ్‌నగర్, బౌద్ధనగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా చేరి స్థానికు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.