గత మూడు నాలుగు నెలల క్రితం టమాటా ధర ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టమాట కొనాలంటే ప్రజలు వణికిపోయారు. కానీ రైతులకు మాత్రం మేలు జరిగింది. కొంతమంది రైతులు ఏకంగా కోటీశ్వరులయ్యారు కూడా. సామాన్యులు మాత్రం చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. అయితే కొంతకాలంగా ఆ పరిస్థితులు తగ్గి ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. మళ్లీ ఇప్పుడు టమాటా ధర పైకి ఎగబాతుండటం సామాన్యులను కలవర పెడుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ రైతు బజారులో కిలో టమాట ధర రూ.25 ఉంటే.. బయట మార్కెట్లు, సూపర్ బజార్లలో రూ.35 నుంచి 40 వరకు ఉంది. మరోవైపు ఉల్లి ధర కూడా తగ్గడం లేదు. రైతుబజారులో ఉల్లి కిలో ధర రూ. 40 ఉండగా.. బయట మార్కెట్లలో రూ.50నుంచి 70 వరకూ ఉంది. గతేడాది ఉల్లి ధరలు బాగా తగ్గిపోవడంతో ఈ ఏడాది పంట తక్కువగా వేయడం.. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో దాదాపు 60 శాతం ఉల్లి పంట తగ్గింది. దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. టమాట కూడా తక్కువ మొత్తంలో వస్తోందని.. ఇలాగే కొనసాగితే మళ్లీ ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని తెలిపారు.