హైదరాబాద్‌కు తాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టు రిటెయినింగ్ వాల్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఆగస్టు 1న జరిగిన ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు. సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలి క్షణాల్లో పంప్‌హౌస్ జలదిగ్భందమైంది. నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు పోటెత్తడం, ఒక్కసారిగా పంప్‌హౌస్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉద్ధృతంగా రావడంతో టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతోపాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయాయి.
ఈ నేపథ్యంలో ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా సుంకిశాల ప్రాజెక్టును విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సందర్శించింది. రిటైనింగ్ వాల్ ఎలా కూలింది? ప్రాజెక్టు ప్రస్తుత స్థితి ఏంటి వంటి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.