వరంగల్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మత్తు మందు ఇచ్చి ఓ వివాహితపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మామునూరు ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ పైడిపల్లికి చెందిన వివాహిత(32) హనుమకొండ బీమారంలోని ఓ కర్రీపాయింట్‌లో పని చేస్తున్నారు. ఏప్రిల్ 20న ఓ స్నేహితురాలు ఫోన్ చేసి పని ఉందని, ఆరెపల్లికి రావాలని సూచించగా… ఆమె భర్త తనని బైక్‌పై తీసుకొచ్చి, వదిలి వెళ్లిపోయారు. అప్పటికే స్నేహితురాలు వేచి చూస్తున్నారు. కాసేపటికి అక్కడికి ఓ కారులో రవి, డి.నాగరాజు వచ్చి వీళ్లిద్దరినీ అందులో ఎక్కించుకున్నారు. కారు ములుగు జిల్లా సరిహద్దుకు వెళ్లాక స్నేహితురాలు దిగిపోయారు.
అక్కడ ఎ.రమేశ్, బి.లక్ష్మణ్, బి.సుధాకర్ అనే ముగ్గురు వ్యక్తులు కారులోకి ఎక్కారు. మహిళకు మత్తు మందు ఇచ్చారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ములుగులో బస్సు ఎక్కించారు. ఆ తర్వాత ఆమె ఎవరికీ చెప్పకుండా కరీంనగర్‌లోని రామడుగులో ఉండే తల్లి వద్దకు వెళ్లారు. రెండు, మూడు రోజులైనా భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఏప్రిల్ 25న ఎనుమాముల ఠాణాలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో బాధితురాలు కులపెద్ద సహకారంతో భర్త వద్దకు వచ్చి… ఆయనకు విషయమంతా తెలిపింది. దాంతో ఏప్రిల్ 29న అయిదుగురు యువకులపై ఎనుమాముల స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.