ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారు – వైఎస్ షర్మిల

-

రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నట్టు? అని నిలదీశారు.

ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు,ముగ్గురిని పడేయడమా? లక్షమందికి ఒక డాక్టర్, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా? కుని ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా? JHS, EHS స్కీములను పాతరేయడమా? 104 పథకాన్ని మూసేయడమా? పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా? మీరు హామీ ఇచ్చిన.. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు. రాజధానిలో నలుదిక్కులా హెల్త్ హబ్బులు లేవు.

ఉస్మానియా హెల్త్ టవర్ లేదు. ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టింపులేదు. పరికరాలు, యంత్రాలు పనిచేయకపోయినా దిక్కూమొక్కూ లేదు. మారుమూల గ్రామాలకు అంబులెన్సులు లేవు. దవాఖాన్లలో సిబ్బంది లేరు. ఆసుపత్రి భవనాలు పాతబడి, పెచ్చులూడుతున్నా సోయి లేదు. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారు. జబ్బు చేస్తే అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version