ఏ విధంగా అయినా తెలంగాణపై పట్టు తెచ్చుకోవాలని పరితపిస్తున్న బీజేపీకి ఇప్పుడొక సందర్భం దొరికింది. అదును దొరికింది. ఎన్నేళ్లుగానో చేయని ఓ పని ఇప్పుడు చేస్తోంది. ఆ రోజు ఈ చిన్నమ్మను గుర్తు పెట్టుకోండి అని చెప్పిన సుష్మా స్వరాజ్ మాటల యాదిలో ఇవాళ అమిత్ షా వర్గం ఉంది. అందుకనో ఎందుకనో పట్టుకోసం మరియు పరువు కోసం పరితపిస్తోంది.ఈ క్రమాన
తెలంగాణ వాకిట నిలదొక్కుకునేందుకు ఓ కొత్త వ్యూహం తెరపైకి తెచ్చింది. ఆ విధంగా ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సిద్ధం అవుతోంది. మొదటి సారి చేస్తున్న ఈ ప్రయత్న ఫలితం కానీ ప్రభావం కానీ ఏ మేరకు సత్ఫలితాలు ఇవ్వనుందో చూడాలక !
ఇదే తొలి అడుగు..కేసీఆర్ వర్గాల్లో వణుకు
పాలక పక్షం తెలంగాణ రాష్ట్ర సమితికి అప్పు పుట్టనిస్తలేదు బీజేపీ. ఇదే సమయంలో తెలంగాణను ఆదుకునేది, సాదుకునేదే మేము అని చెబుతున్న బీజేపీ నాయకులు తమదైన శైలిలో కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. తొలి అడుగులో భాగంగా తొలిసారి హస్తిన పురి వాకిట తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. ఆ వివరం ఈ కథనంలో
మారిన నడవడి.. అప్పులతో మరో ఏడాది
తెలంగాణను ఇస్తనన్నోడు ఇవ్వలే అని గద్దర్ ఉలుకు ఉంది. కానీ గద్దర్ ఉలుకు పెద్దగా గుర్తింపులో లేదు. అందుకే ఆయన పాటకూ విలువ లేదు. పాలకుల పక్షాన అటు ఇటూ ఊగుతున్న గద్దర్ ఏం చేయాలో అది చేయడం లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం తరువాత తెలంగాణ నడవడి మారిపోయింది. పాలకుల కారణంగా ముందు కన్నా ఎక్కువ అప్పుల్లో ఇరుక్కున్నది. ఈ దశలో సీన్లోకి బీజేపీ ఎంటర్ అయింది. అందుకే బీజేపీ గర్జనలు తెలంగాణకు అనుకూలంగా సాగుతున్నాయి. అందుకు సాక్ష్యమే ఇవాళ్టి ఢిల్లీ వేడుకలు.. కాదు కాదు ఢిల్లీలో తెలంగాణ వేడుకలు.
సిసలు కారణం వేరే ఉంది..ఇంకా చెప్పాలంటే…
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రేపటి వేళ దేశ రాజధానిలో చేసేందుకు హోం మంత్రి అమిత్ షా తో సహా ముఖ్య బీజేపీ నాయకులు సన్నాహాలు పూర్తి చేశారు. త్యాగాల తెలంగాణకు సంబంధించి ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క ఆవిర్భావ వేడుకనూ చేయని బీజేపీ ఈ సారి మాత్రం మనసు మార్చుకుంది. తెలంగాణ సంస్కృతికి నిదర్శనంగా నిలిచే ఆటపాటలతో ధూం ధాం ను నిర్వహించనున్నా రు. ఇందుకు విఖ్యాత గాయనీ గాయకులు మంగ్లీ, హేమ చంద్ర సహకారం తీసుకోనున్నారు. అదేవిధంగా మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏవి ఎలా ఉన్నా తొలిసారి బీజేపీ నేతృత్వాన జరుగుతున్న ఈ వేడుకలకు ఇంతటి ప్రాధాన్యం దక్కడం వెనుక సిసలు కారణం వేరే ఉంది.
తెలుగు ప్రాంతాలంటే ఎంతిష్టమో !
అంత ఇష్టమేందయ్యా మా మీద…
వాస్తవానికి ఎప్పటి నుంచో తెలుగు రాష్ట్రాలపై మనసు పారేసుకుంటున్న బీజేపీ అధిష్టానానికి అధికారం ఇక్కడ అందని ద్రాక్షే అవుతుంది. సాంస్కృతిక పునరుజ్జీవం నుంచి తెలంగాణ ఉద్యమం సాగింది. భాష, సంస్కృతి, కళలను కాపాడుకుని తీరాలన్న నైజం, వాటితో పాటు ఇంకొన్ని అస్తిత్వ గొంతుకలు కారణంగా ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. కానీ తెలంగాణ ఏర్పాటు అయ్యాక అది ఓ కుటుంబానికి మాత్రమే పరిమితం అయిందన్న బాధ చాలా మంది ఉద్యమ కారుల్లో ఉంది. ఓ వైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ లీడర్లు ఇదే మొత్తుకుంటున్నారు. ఈ దశలో తెలంగాణ నాదే అని చెప్పేందుకు అమిత్ షా మరోసారి చేస్తున్న ఓ వినూత్న ప్రయత్నం దేశ రాజధానిలో ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవాన వేడుకలు నిర్వహించడం.