తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి చాలా వింతగా ఉంటుంది..అసలు అంతా బాగుందనుకునే సమయంలో… కాంగ్రెస్‌లో ఏదొక ట్విస్ట్ వస్తుంది..పార్టీ పరిస్తితి మళ్ళీ మొదటకొస్తుంది. అదిగో పార్టీకు ఊపు వచ్చిందనుకునే లోపు..పార్టీలో జరిగే అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరి..పార్టీ మళ్ళీ గోతులో పడుతుంది. అసలు ఎప్పుడు కాంగ్రెస్ బాగుంటుందో, ఎప్పుడు బాగోదో అర్ధం కాకుండా ఉంది.
అయితే ఈ మధ్య కాస్త కాంగ్రెస్‌లో మార్పు కనిపించింది. ఎప్పుడైన ఎన్నికల్లో ఎన్నో తిప్పలు బడి చివరికి అభ్యర్ధిని నిలబెడతారు. కానీ ఈ సారి మాత్రం మునుగోడు ఉపఎన్నికలో అందరికంటే ముందుగానే అభ్యర్ధిని ఖరారు చేసేశారు. పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ప్రకటించారు. ఆమె ఇప్పటికే ప్రచారంలో దూసుకెళుతున్నారు. మిగతా ఉపఎన్నికలతో పోలిస్తే మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి కాస్త పాజిటివ్ కనిపిస్తోంది. ఇంకాస్త కష్టపడితే మునుగోడులో మంచి ఫలితం రాబట్టవచ్చు అనే విధంగా పరిస్తితి ఉంది.
అంతా బాగుంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది..అందుకే ఇక్కడే కొత్త ట్విస్ట్ వచ్చింది. ఈ నెల 24న రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఇది ఓ రకంగా మంచిదైనా…మరోరకంగా ఇబ్బంది అయ్యేలా ఉంది. అలా రెండు రకాల పరిస్తితులు కాంగ్రెస్‌కు ఉన్నాయి. వాస్తవానికి రాహుల్ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది.
ఈ క్రమంలో తెలంగాణకు వస్తున్న రాహుల్ యాత్ర..తెలంగాణ కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే..ఆల్రెడీ మునుగోడు ఉపఎన్నిక ప్రక్రియ మొదలైపోయింది. నవంబర్3న ఎన్నిక, 6న ఫలితం రానుంది. అయితే రాహుల్ యాత్ర తెలంగాణలో 15 రోజులు ఉండనుంది. అంటే మునుగోడు ఉపఎన్నిక అయ్యేవరకు జరగనుంది. ఇక ఈ సమయంలో మునుగోడుపై ఫోకస్ పెట్టాల్సిన కీలక నేతలు..రాహుల్ యాత్రపై పెట్టనున్నారు. దీంతో మునుగోడులో పార్టీకి ఇబ్బంది అవుతుంది.
అందరూ పాదయాత్రకు వెళితే..మునుగోడులో కాంగ్రెస్‌కు రిస్క్ ఉంటుంది. అయితే రాహుల్ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వస్తే..ఆ ప్రభావం మునుగోడుపై ఉంటుంది. అలా కాకుండా అంతంత మాత్రమే ఉంటే..రెండు రకాలుగా కాంగ్రెస్‌కు నష్టమే. పైగా మునుగోడు ఉపఎన్నిక తేడా కొడితే..ఆ తర్వాత జరిగే రాహుల్ పాదయాత్రపై ప్రభావం ఉంటుంది. మరి రాహుల్ యాత్ర, మునుగోడు ఉపఎన్నిక..ఈ రెండిటినీ కాంగ్రెస్ ఎలా సమన్వయం చేసుకుంటుందో చూడాలి.