ఇట్లు మీ విశ్వాస పాత్రుడు అని ముగించడం సులువు. ఇట్లు మీ విధేయుడు అని రాయడం సులువు. ఇట్లు మీ ఆత్మ బంధువు అని చెప్పడం ఇంకా సులువు. పదాలు ఏమయినా రాజకీయాల్లో విశ్వసనీయత అన్నది దొరకడం కష్టం. కష్టం అనే కన్నా దుర్లభం అని రాయాలి. ఎన్నో కష్టాలు, అవమానాలు దాటితేనే రాజకీయంలో పేరు వస్తుంది. పేరుకు తగ్గ కీర్తి వస్తుంది. కీర్తి కి తగ్గ సంపద వస్తుంది. పేరు,కీర్తి, యశస్సు ఇంకా ఇంకొన్ని ఊరికే రావు. ఒక మురికి కాలువలో ఉండి మంచి నీళ్ల అన్వేషణ చేయడం కష్టం. కానీ మురికి కాలువను ప్రక్షాళన చేసి మంచి పనులకు ఆ నీటిని వినియోగించడం ఇంకా పెద్ద ప్రక్రియ. మురికి కాలువనే ఆక్రమించి హాయిగా ఓ ఇల్లు కట్టేయడం ఓ సులువు.
రాజకీయంలో మూడోదే ఎక్కువ జరిగి తీరుతాయి. అక్రమణలు అతిక్రమణలే ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ కొందరు మాత్రం తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీకి సంబంధం లేదు అని చెప్పగల సమర్థులు ఉంటారు. అవరోధాలు మరియు ఆంక్షలు ఎదురయినా కూడా జైలు పాలయినా కూడా నమ్మిన సిద్ధాంతం వదులుకోవడం వారికి జరగని పని. ఆ కోవలో ఆ తోవలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిలుస్తారు. వరుసాగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.ఆ రోజు టీడీపీ హయాంలో వరుస నిరసనలతో హోరెత్తించారు. ప్రజా సమస్యలపై పోరాడారు. నాటి వైఎస్సార్ నుంచి నేటి వైఎస్ జగన్ వరకూ ఆ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్నారు. నమ్మిన విలువల కోసం కట్టుబడి ఉన్నారు. అయినా ఆయనకు ఇప్పటిదాకా పదవుల పంపకంలో సముచిత ప్రాధాన్యం లేదు. తన కన్నా జూనియర్లు అయిన గౌతం రెడ్డి కి కానీ అనిల్ కు కానీ ప్రాధాన్యం ఇచ్చినా కూడా ఏ రోజూ పల్లెత్తు మాట అనలేదు.
వారిని తాను ప్రోత్సహించానే తప్ప వారి దారికి అడ్డం కాలేదని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. అయినా సరే తాను ఇవాళ (ఏప్రిల్ 11 ) న నిర్ణయించిన గడగడకూ వైఎస్సార్ ప్రొగ్రాంను ప్రారంభిస్తానని చెప్పారు. ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేస్తూ రాజీనామాలు చేస్తామన్న స్థానిక ప్రజాప్రతినిధులను వద్దని సముదాయించారు. నా మాట మీద గౌరవం ఉంటే ఎవ్వరూ తమ పదవులకు రాజీనామా చేయవద్దని పదే పదే మీడియా ముఖంగా చెప్పారు. దటీజ్ కోటంరెడ్డి. ద గ్రేట్ సోల్జియర్.
రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి…
ఉత్తమ పురుష – మన లోకం ప్రత్యేకం
శ్రీకాకుళం దారుల నుంచి…
ఉత్తమ పురుష – మన లోకం ప్రత్యేకం