మునుగోడు ఉపఎన్నిక ఫైట్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతుంది…అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉపఎన్నికని ప్రధాన పార్టీలు సెమీ ఫైనల్ గా భావించి బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే ఉపఎన్నిక షెడ్యూల్ రాకపోయినా సరే, ప్రధాన పార్టీలు మునుగోడులో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. అలాగే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తరుపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీకి దిగడం ఖాయం.
అటు టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది…అలాగే కాంగ్రెస్ నుంచి చల్లమల్ల కృష్ణారెద్ద్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద మూడు పార్టీల నుంచి రెడ్లే పోటీ చేస్తారని తెలుస్తోంది. నిజానికి ఇక్కడ త్రిముఖ పోరు జరుగుతుంది కానీ..అసలు సీన్ చూస్తుంటే కోమటిరెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి అన్నట్లు వార్ నడుస్తోంది. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలని మంత్రి జగదీశ్ రెడ్డి తీసుకున్నారు. కోమటిరెడ్డి రాజీనామా చేస్తారనే కథనాలు వస్తున్న దగ్గర నుంచి మంత్రి జగదీశ్ మునుగోడులో ఎంట్రీ ఇచ్చి…అక్కడ పార్టీ శ్రేణులని ఎన్నికలకు సిద్ధం చేశారు.
అలాగే కాంగ్రెస్ లో ఉన్న బలమైన నేతలని టీఆర్ఎస్ వైపు లాగేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేలా చూసుకుంటున్నారు. ఇలా మునుగోడులో పార్టీ గెలుపు కోసం మంత్రి కష్టపడుతున్నారు. అదే సమయంలో కోమటిరెడ్డి టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు కూడా… రాజగోపాల్‌రెడ్డి మోసకారి మాటలను మరోసారి నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరని, గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నీచుడని, ప్రజా కంఠక పార్టీ అయిన బీజేపీలో చేరి రాజగోపాల్‌రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నారని, ఆయనకివే చివరి ఎన్నికలని ఫైర్ అవుతున్నారు.
అటు కోమటిరెడ్డి సైతం జగదీశ్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు…ఆయనపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతి అక్రమాలు, నేర చరిత్రపై త్వరలో చిట్టా విప్పుతానని, మంత్రి అయిన తర్వాత జగదీశ్‌రెడ్డి వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఆయనపై అనేక హత్య కేసులున్నాయని, జైలుకు వెళ్లాడని కోమటిరెడ్డి రివర్స్ లో కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికైతే మునుగోడులో కోమటిరెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి అన్నట్లు రాజకీయం నడుస్తోంది.