ఈ ఫేస్ మాస్క్‌లు అబ్బాయిల కఠినమైన చర్మాన్ని నిమిషాల్లో కాంతివంతం చేసేస్తాయి..!

-

ఎప్పుడూ బ్యూటీ టిప్స్ అంటే అమ్మాయిలకేనా.. అబ్బాయిలకు ఏం ఉండవా..అసలు ఈ విషయం పై చాలా తక్కువగా మాట్లాడుకుంటాం.. అబ్బాయిలకు పెద్దగా స్కిన్ మీద శ్రద్ధ ఉండదు. చాలావరకూ బాయ్స్ స్నానం చేయడమే గొప్ప విషయంగా భావిస్తారు.. ఇంకా బ్యూటీ టిప్స్ ఎక్కడ ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు అందం మీద అబ్బాయిలకు కూడా శ్రద్ధ పెరిగిందండోయ్.. సోషల్ మీడియాలో దిమ్మతిరిగే ఫోటోలు పెట్టాలంటే.. మంచి హెయిర్ స్టైయిల్ ఉంటే సరిపోదు.. స్కిన్ కూడా క్లీన్ గా ఉండాలి. సమ్మర్ లో.. బాయ్స్ స్కిన్ సరిపడా ఫేస్ మాస్క్ ఏంటో చూద్దామా..! సహజ పదార్ధాలతో తయారు చేసిన కొన్ని హెర్బల్ ఫేస్ మాస్క్‌లను వారాంతంలో అప్లై చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. పసుపు చర్మానికి సంబంధించిన అన్ని చర్మ సమస్యలను దూరం చేసి ముఖం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అదే సమయంలో దీనికి కొద్దిగా రోజ్ వాటర్ జోడించడం కూడా చర్మం pH బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం పసుపు పొడిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి బాగా పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. అయితే అబ్బాయిలు ముఖానికి పసుపు పెట్టుకుంటే వింతగా చూస్తారు.. కానీ ఎక్కడా పసుపు అమ్మాయిలు మాత్రమే వాడాలని లేదు.. ఇది చర్మాన్ని కాపడుతుంది. ఎవరైనా యూస్ చేయొచ్చు.. సరే ఎందుకొచ్చిన లొల్లి ఇంకేదైనా చెప్పండి అంటారా.. అయితే ఇవి చూడండి..

తేనెలో పాలు కలిపి ఫేస్ కి పెట్టడం వల్ల.. దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ అయి.. చర్మం తేమగా ఉంటుంది. ఈ ప్యాక్ తయారు చేయడానికి 4 చెంచాల తేనెలో కొద్దిగా పచ్చి పాలను మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేయండి. 20 నిమిషాలు ఆరనివ్వండి, ఆపై మీ ముఖాన్ని మంచినీటితో కడగాలి.

ప్రొటీన్లు, విటమిన్లు కలిగిన గుడ్డు వేసవిలో డల్ నెస్ ,డ్రైనెస్ తొలగించి చర్మాన్ని మెరుగుపరుస్తుంది.. ఇందుకోసం గుడ్డులోని పచ్చసొనలో బాదం నూనెను కలిపి పేస్ట్‌ చేయండి. దీన్ని ముఖం, మెడకు బాగా పట్టించాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.

అలోవెరాలో ఫ్రెష్ క్రీమ్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం సహజంగా మెరుస్తుంది. ఈ మిశ్రమాన్ని ప్రతి వారాంతంలో ఒకసారి ముఖానికి రాసుకుని 15 నిమిషాల పాటు ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మంచి రిజల్ట్ ఉంటుంది.

పైన చెప్పినవి అన్నీ చేయడం మా వల్ల ఎక్కడ ఐతదీ..పేస్ట్ చేయడం, కలపడం అంత ఓపిక లేదా.. అయితే సింపుల్ గా ఫ్రిడ్జ్ లో ఉన్న మాంచి ఎర్రగా ఉన్న ఒక టమోటా తీసుకోండి. దాన్ని రెండు ముక్కలుగా కట్ చేయండి.. ఇక ఒక ముక్క తీసుకుని ఫేస్ అంతా క్లీన్ చేయండి. ఆరిన తర్వాత ఇంకో ముక్కను కూడా అప్లై చేయండి.. ఆరాక కడిగేస్తే చాలు.. ఇంకాస్త టైం ఉంటే.. ఇలా కూడా చేయొచ్చు.. టమటాను గుజ్జుగా చేసి..కొద్దిగా మజ్జిగ కలిపి ముఖానికి రాయండి. టమాటా టానింగ్, సన్ బర్న్ నుండి బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుంది. ముఖం పై మచ్చలు పోతాయి. ఫేస్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతంది.

అయితే ఏ ఫేస్ ప్యాక్ వేసినా… వెంటనే సబ్బుతో క్లీన్ చేయకూడదు. మినిమమ్ 6-7 గంటలపాటు.. ఫేస్ కి ఎలాంటి సబ్బు, క్రీమ్స్, లోషన్స్ రాయకూడదు. అప్పుడే మీరు వేసిన ఫేస్ ప్యాక్ కు రిజల్ట్ ఉంటుంది. వేసిన వెంటనే తెలియదు. కొద్ది గంటల గడిచిన తర్వాత దాని ప్రభావం ముఖం మీద కనిపిస్తుంది. కాబట్టి సోప్ అప్లై చేయొద్దంటున్నారు నిపుణులు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version