వైఎస్.షర్మిల ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో సుస్థిర స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేత. తాజాగా తెలంగాణ ప్రభుత్వ విధానాలను వ్యతిరేఖిస్తూ… సొంత అజెండాతో ముందుకు వెళ్తుంది. తన తండ్రి దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా జూలైలో తెలంగాణలో నూతన పార్టీని స్థాపిస్తానని ప్రకటించింది. అందుకోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. జిల్లాల వారీగా నమ్మకస్తులతో సమావేశాలు నిర్వహించి… వారికి బాధ్యతలను అప్పగించిందని సమాచారం. అంతే కాకుండా రాష్ర్ట వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తూ… ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకం కావాలని యోచిస్తోంది. అందుకోసం టీఆర్ఎస్ ను కూడా ఢీ కొంటోంది.
ఇక్కడి దాకా బాగానే ఉన్నా… తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ ప్రభుత్వం చేసిన పనితో షర్మిలకు ఏం చేయాలో పాలు పోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య నీటి వివాదాలు రచ్చకెక్కాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమంగా బ్యారేజీలు నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడి మంత్రులు కూడా షర్మిల అన్నయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డిని తీవ్రంగా దూషిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా… షర్మిల నోరు విప్పడం లేదు. తన వాళ్లను తిడుతున్నారని వీరిపై ఫైర్ అయితే.. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిందని ఇక్కడి వారంతా షర్మిల వ్యవహారం విరుచుకుపడే ఛాన్సుంది. ఈ కారణంతోనే తన వాళ్లను ఎవరెన్ని మాటలంటున్నా… షర్మిల నోరు మెదపడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఓవైపు రక్తసంబంధం, మరో వైపు రాజకీయ ఆరంగ్రేటం తో షర్మిల ఎటూ మాట్లాడలేని స్థితిలో మిగిలిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.