పిరిమిడ్స్ అంటే.. ఆ దేశ ప్రజలకు ఆలయాలతో సమానం..వాటిని చాలా గౌరవంగా, భద్రంగా చూసుకుంటారు. కొన్ని వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలు అవి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంటుంది. అయితే.. మెక్సికోలోని మయన్ పిరమిడ్ ఎక్కిన ఓ మహిళ చేసిన నిర్వాకానికి అక్కడ ఉన్న పర్యాటకులు ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మహిళ పిరమిడ్ దగ్గర ఏం చేసింది..?
మెక్సికో (Mexico)లోని మయన్ పిరమిడ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. యుకాటాన్‌లోని చిచెన్ ఇట్జాలో ఉంది. మెట్లతో ఎత్తుగా ఉండే ఎల్ కాస్టిల్లో (El Castillo) పిరమిడ్.. మయన్లకు దైవ సమానం. సూర్యుడిని పూజిస్తూ వారు ఆ పిరమిడ్‌ని నిర్మించుకున్నారు. చూసేందుకు వెళ్లిన ఓ మహిళ అది ఎక్కి అసభ్యకరమైన డ్యాన్స్‌లు వేసింది.. అది చూసిన పర్యాటకులు ఆమెను కిందకు దిగాలని డిమాండ్ చేశారు. కిందకు దిగిన తర్వాత ఆమెపై వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పర్యాటకుల నుంచి పురాతత్వ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయినప్పటికీ పర్యాటకులు ఆమెపై దాడి చేశారు. ఆమె టోపీని లాగేశారు.
ఈ ఘటనను చాలా మంది తమ మొబైళ్లతో రికార్డ్ చేశారు. చాలా మంది ఆమెను లాకప్‌లో పెట్టాలని, జైలుకు పంపాలని ఆందోళన చేశారు.. స్పానిష్ భాషలో నినాదాలు చేశారు. దీనిపై అధికారులు స్పందించారు. ఇలాంటి పురాతన కట్టడాల్ని దగ్గరకు వెళ్లి చూడొచ్చుగానీ.. వాటి పైకి ఎక్కడం, వాటిని నాశనం చేయడం కరెక్టు కాదని తెలిపారు.. రిపోర్టుల ప్రకారం.. ఆ పిరమిడ్ ఎక్కేందుకు పర్యాటకులకు వీలులేదు. దీనికి సంబంధించి.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (INAH) సంస్థ నిషేధాజ్ఞలు ఉన్నాయి. 2006 జనవరిలో 80 ఏళ్ల ఓ ముసలావిడ.. 91 ఏళ్ల ఆ పిరమిడ్ ఎక్కింది. అప్పట్లో అందరూ ఎక్కేవారు. అయితే… ఆ ముసలామె.. పైకి ఎక్కాక అక్కడి నుంచి జారి పడి చనిపోయింది. అప్పటి నుంచి.. ఆ పిరమిడ్ ఎవరూ ఎక్కకుండా నిషేధం విధించారు.
ఈజిప్షియన్లకు ఎలాగైతే ప్రత్యేక నాగరికత ఉందో.. మయన్లకు కూడా అలాగే ఉంది. వారు సూర్యుణ్ని పూజిస్తూ.. భవిష్యత్తును అంచనా వేసేవారు. వారి బొమ్మల భాషకు అర్థాలు ఇప్పటికీ తెలియవు. కానీ వారు భవిష్యత్తును కరెక్టుగా ఊహించేవారని కొందరు ఈరోజుకి బలంగా నమ్ముతున్నారు. రకరకాల రహస్యాలతో కూడిన వారి సంస్కృతిని కాపాడేందుకు యునెస్కో సహా చాలా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయినా అప్పుడప్పుడూ ఇలాంటి టూరిస్టులు.. పురాతన కట్టడాలకు హాని చేయడం అక్కడి వారికి ఆందోళన కలిగిస్తోంది.