టీపీసీసీ చీఫ్ రేవంత్ నయా స్కెచ్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఐక్యత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన నాటి నుంచి సీనియర్ నేతల మద్దతు కోరుతున్నాడు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీని క్రియాశీల పోరాటాల వైపు మరల్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.

ఇంద్రవెల్లిలో జరిపిన ‘దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా’ సభతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. పార్టీని మళ్లీ పోరాట పఠిమ వైపు తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వైపు టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూనే మరో వైపున బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నాడు రేవంత్. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు, రైతుల స‌మ‌స్య‌ల‌పై వ‌రుస నిర‌స‌న‌లకు ప్లాన్ చేస్తున్నాడు. ‘దళిత బంధు’కు కౌంటర్ అటాక్‌గా ‘దళిత‌, గిరిజ‌న ఆత్మగౌరవ దండోరా’ ప్లాన్ చేశారు రేవంత్. ఇంద్రవెల్లి సభ ఫుల్ సక్సెస్ కాగా, రెండో సభ ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధిష్టానం.

అయితే, అక్కడ సభ నిర్వహణకు పోలీసులు అనుమతించకపోవడంతో ‘రావిర్యాల’లో రెండో సభ జరిగింది. ఇక అప్పుడే మూడో సభ గురించి రేవంత్ ఆలోచించారట. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ సభ ఉండేలా ప్లాన్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఈ నెల 24న నిర్వహించాలనుకుంటున్నాడట. తద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సభ నిర్వహించడం ద్వారా ఓ వైపు కేసీఆర్, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసినట్లవుతుంది. మరో వైపున బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్‌ను కూడా టార్గెట్ చేసినట్లవుతుంది. మొత్తంగా రేవంత్ టీఆర్ఎస్, బీజేపీ రెండిటినీ టార్గెట్ చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version