‘కారు’ గేమ్ స్టార్ట్..పాత ఫార్ములాతో?

-

ఏంటో ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి చేయాలి…లేదంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ వైఖరి ఉంది. ఇంతకాలం నియోజకవర్గాల అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోని టీఆర్ఎస్..ఉపఎన్నికలు వస్తే చాలు…ఆ నియోజకవర్గానికి నిధుల వరద పారిస్తుంది. ఉపఎన్నికలో గెలవడానికి వందల కోట్లు ఖర్చు పెడుతుంది. ఇప్పటివరకు ఉపఎన్నికల్లో ఇదే ఫార్ములాతో పనిచేసింది.

హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం కోసం వందల కోట్లతో అభివృద్ధి పనులు, హామీలు ఇచ్చుకుంటూ వచ్చింది. అయితే హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది…కానీ దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఫార్ములా ఉపయోగపడలేదు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రజలు…తాము అనుకున్న అభ్యర్ధులనే గెలిపించుకున్నారు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ ఫార్ములా పదే పదే వర్కౌట్ అవ్వదని చెప్పొచ్చు.

కానీ అదే ఫార్ములాతో మునుగోడులో రాజకీయం చేయడానికి టీఆర్ఎస్ రెడీ అవుతుంది. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయకముందే…మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించడం మొదలుపెట్టింది. ఇప్పుడు రాజీనామా చేయడంతో ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ మళ్ళీ నిధులు అందించడం మొదలుపెట్టింది. అయితే గతంలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలవడానికి కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు, ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షల అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. హామీ ప్రకారం…జిల్లాలోని మిగతా నియోజకవర్గాలకు నిధులు వచ్చాయి గాని…కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉన్న మునుగోడుకు నిధులు రాలేదు.

ఇప్పుడు కోమటిరెడ్డి రాజీనామాతో.. మునుగోడు నియోజకవర్గంలోని 157 గ్రామ పంచాయతీలు, ఆరు మండల కేంద్రాలకు కలిపి మొత్తం రూ.33.20 కోట్లు విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. అలాగే కొత్త మండలాల ఏర్పాట్లు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కొత్తగా చండూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పడితే కోర్టు, 100 పడకల ఆస్పత్రి, ఫైర్‌స్టేషన్‌ వంటి అనేక వసతులు అందుబాటులోకి వస్తాయి. మొత్తానికి ఉపఎన్నిక వల్ల మునుగోడు అభివృద్ధి అయ్యేలా ఉంది. మరి అదే పాత ఫార్ములా వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news