కాంగ్రెస్ టార్గెట్ చేయడంతో ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారా ?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు వివాదం చిలికి చిలికి గాలివానల మారింది. డిగ్రీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రిజిస్టర్ చేసుకుని దొంగ ఓటు వేశారంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు తాండూరు టీఆర్ఎస్ రోహిత్ రెడ్డిని చిక్కుల్లో పడేశాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు గవర్నర్,కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. సొంత పార్టీలోని వర్గపోరు సైతం ఎమ్మెల్యేని మరింత చిరాకు పెడుతున్నట్లు తెలుస్తుంది.

హైదరాబాద్, రంగారెడ్డి,మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఈ విషయంలో ఎందాకైన వెళ్ళేలా ఉంది. స్వీడన్‌లో డిగ్రీ చేసినట్టుగా తప్పుడు సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చారన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. వెబ్‌సైట్‌లో మాత్రం అమెరికాలో ఎంఎస్ చదివినట్టు పెట్టుకున్నారని విమర్శిస్తూ.. ఆ వివరాలను సీఈవోకి అందజేసింది. దీని పై కలెక్టర్‌ను విచారణకు ఆదేశిస్తామని చెప్పారు శశాంక్‌ గోయల్‌. ఎమ్మెల్యే డిగ్రీ సర్టిఫికెట్‌ పరిశీలించకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఓటు హక్కు కల్పించిన ఎన్నికల సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలన్నది కాంగ్రెస్‌ డిమాండ్‌.

ఇప్పటికే ఇదే నియోజకవర్గానికి చెందిన తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వప్న సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అంశం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన ప్రస్తావించిన విద్యార్హతలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు పొందేందుకు చూపించిన పత్రాలు విరుద్ధంగా ఉన్నాయన్నది రోహిత్‌రెడ్డి ప్రత్యర్థులు చేసే ఆరోపణ. ప్రస్తుతం బంతి ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వెళ్లింది. కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే ఈ విషయం కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యేకి గట్టి షాకివ్వాలని చూస్తుంది.

ఎమ్మెల్యేకు సొంత పార్టీలోని ప్రత్యర్దులు సైతం పెద్ద సమస్యగా తయారయ్యారు. ఏకంగా దొంగ సర్టిఫికెట్ల ముఠాతో ఎమ్మెల్యేకు సంబంధాలు ఉన్నట్టు తీవ్ర ఆరోపణలు తెరపైకి తీసుకొస్తున్నారు. వీటిని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఖండిస్తున్నా రాజకీయంగా మాత్రం వివాదం దుమారం రేపుతోంది. దీని వెనక కాంగ్రెస్‌ నేతలే ఉన్నారా లేక రోహిత్‌ అంటే గిట్టని సొంత పార్టీ నేతలు ఇంకెవరైనా పావులు కదుపుతున్నారా అని చర్చించుకుంటున్నారు.