రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేరు. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నాయకుడు, రేపు మరో పార్టీలో ఉంటారు. ఇక ప్రత్యర్ధి పార్టీపై తీవ్ర విమర్శలు చేసి, మళ్ళీ అదే పార్టీలో చేరే నాయకులు ఉన్నారు. అలాగే రాజకీయ నాయకులకు పెద్ద లాజిక్‌లు కూడా ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో ఇదే మిస్ అయిందని చెప్పొచ్చు. అందుకే నాయకులు ఇప్పుడు ఏ మాత్రం లాజిక్ లేకుండా రాజకీయాలు చేస్తున్నారు.తెలంగాణ రాజకీయాల్లో మొన్నటివరకు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు.
ఇక ఈటల బీజేపీలోకి వెళ్లడమే, టీఆర్ఎస్ నేతలు ఆయనపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మొన్నటివరకు వాళ్ళ పక్కనే ఉన్న ఈటల ఇప్పుడు బీజేపీలో చేరి పెద్ద తప్పు చేశారనే భావనతో మాట్లాడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, కొన్ని లాజిక్ లేని విమర్శలు ఈటల మీద చేశారు. సాధారణ కార్యకర్తగా ఉన్న ఈటలని నెంబర్ 2 పొజిషన్‌కు తీసుకొచ్చింది కేసీఆర్ అంటున్నారు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్‌పైనే ఈటల విమర్శలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
అలాగే ఎస్సీ, ఎస్టీల భూముల కబ్జా చేస్తే , దానిపై విచారణకు ఆదేశిస్తే తప్పా అని ప్రశ్నించారు. గతంలో ఆర్టీసీ సమ్మె చేయించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న అశ్వద్ధామరెడ్డితో గంటల పాటు మీటింగులు ఎలా పెట్టారని, కేబినెట్ విషయాలని బయటకు ఎలా చెప్పారని సుమన్, ఈటలని ప్రశ్నించారు.
అయితే ఇక్కడే సుమన్ లాజిక్ మిస్ అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. గతంలో కేసీఆర్‌ని బండబూతులు తిట్టినవారు ఇప్పుడు అదే కేసీఆర్ కేబినెట్‌లో పనిచేస్తున్నారని, అలాగే కేబినెట్ విషయాలు ఈటల బయట చెబుతున్నారంటే, అప్పుడే ఈటలని వారిస్తే బాగుండేది అని, ఇక భూ కబ్జా వ్యవహారంపై ముందే ఈటలని అడగాల్సిందని అంటున్నారు. ఏదేమైనా గానీ రాజకీయాల్లో పెద్దగా లాజిక్‌లు ఉండవనే అనుకోవచ్చు.