TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులను విచారిస్తున్న పోలీసులకు ఈ వ్యవహారంలో మరికొంత మంది ఉన్నట్లు తెలిసింది. గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన గ్రూప్-1 అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్ అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జాబితాలో ఉన్నవారికి, రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లకు మధ్య ఏమైనా ఫోన్ సంభాషణలు జరిగాయా, ఛాటింగ్ చేశారా? అన్న విషయాలను నిర్ధారించుకుంటున్నారు. సిట్ రూపొందించిన జాబితాలో కొందరు విదేశాల్లో నివాసం ఉంటున్న వారు కూడా ఉన్నారని, ఈ పరీక్ష కోసమే రాష్ట్రానికి వచ్చి… తిరిగి వెళ్లిపోయారని, పరీక్షలో అర్హత కూడా సాధించారని వెల్లడయింది. వీరిలో కొందరి ఫోన్లు అకస్మాత్తుగా స్విచ్చాఫ్ అయ్యాయని కూడా తెలుస్తోంది.
ఆధారాలన్నీ కొలిక్కివచ్చిన తర్వాత వీరందరినీ పిలిపించి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్-1 పరీక్ష లీక్ అయినట్లే భావిస్తున్నామని, లబ్ధిపొందిన వారిని గుర్తించి వారందరిపైనా కేసులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది.