తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి తయారైన నెయ్యిని వాడారంటూ ఏపీలో పెద్ద రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ల్యాబ్ రిపోర్టుల్లోనూ ఈ విషయం నిరూపితమైందని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందంటూ శ్రీవారి భక్తజనం తీవ్రంగా మండిపడుతున్నారు.ఈ ఘటనలో నిందితులను అస్సలే వదలకూడదని కఠినంగా శిక్షించాలని సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స సైతం కోరుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ కల్తీ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదం పక్కా బీజేపీ కుట్రేనని ఆరోపించారు.కాషాయ నేతల డైరెక్షన్‌లోనే సీఎం చంద్రబాబు స్క్రిప్ట్‌ను అమలు చేశారన్నారు.టీడీపీ, వైసీపీకి మధ్య గొడవ పెట్టి మధ్యలో బీజేపీ సీట్లను పెంచుకునే ప్లాన్ చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తేవడంలో సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం పూర్తి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు.