నేటి నుంచి ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 31 వరకు రోజుకు 750 టోకెన్ల చొప్పున టీటీడీ జారీ చేయనుంది. జూలై నెల టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. కాగా.. నేటి నుంచి తిరుమలలో యధావిధిగా అన్ని ఆర్జిత సేవలు జరగనున్నాయి. ఏడుకొండలవాడి సన్నిధిలో నేత్రపర్వంగా జ్యేష్టాభిషేక ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా ఉధృతి తర్వాత మళ్లీ భక్తులకు ఇందులో పాల్గొనే భాగ్యం ఉంది. ఇదిలా ఉంటే.. తిరుమలలో పల్లవోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పల్లవోత్సవంలో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు,మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తూవస్తున్నది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపీణి చేయనున్నారు.