విజయసాయిరెడ్డి-పట్టాభి మధ్య ట్విట్టర్‌ వార్‌.. వాడివేడిగా ట్విట్టస్త్రాలు

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌ వేడెక్కింది. దీంతో ట్విట్టస్త్రాలు సంధించుకుంటున్నారు. జగన్ రెడ్డి ముఠా విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేటు విమానాల్లో విదేశాలకు నల్లధనాన్ని తరలిస్తోందంటూ పట్టాభి తీవ్ర ఆరోపణలు చేయగా, విజయసాయిరెడ్డి కూడా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పట్టాభి కూడా అదేస్థాయిలో విజయసాయి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నువ్వేం మాట్లాడతావో నీకు తెలియదు… ఇలా మాట్లాడే గతంలో మాల్దీవులకు పారిపోవాల్సి వచ్చిందని విజయసాయి ఎద్దేవా చేయగా, నేను పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకం… నిన్ను, నీ ముఠా నాయకుడ్ని చంచలగూడ జైలుకు పరిగెత్తించే వరకు నిద్రపోను అంటూ పట్టాభి బదులిచ్చారు.

TDP demands Vijayasai Reddy arrest in Rs 307 Cr scam in 108 services

సింగపూర్లో హోటళ్ల వ్యవహారం, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచిన విషయం, మలేసియాలో వెయ్యి కోట్లు పొగొట్టుకున్న విషయం చంద్రబాబును అడుగు అంటూ విజయసాయి మరో ట్వీట్ చేయగా…. దీనిపైనా పట్టాభి ఘాటుగా స్పందించారు. హోటల్ యజమానిగా లక్షల మందికి స్వచ్ఛమైన భోజనం పెట్టిన చరిత్ర నాది… తప్పుడు లెక్కలు రాసి జైల్లో చిప్పకూడు తిని సీఏ వృత్తికే కళంకం తెచ్చిన చరిత్ర నీది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కల్తీ మద్యం సొమ్ము దిగమింగి అడ్డంగా దొరికిపోయి దేహీ అంటూ ఢిల్లీ పెద్దల బూట్లు నాకుతున్నారని ఆరోపించారు.