పరిటాల ఫ్యామిలీకి ఆ రెండు ఫిక్స్ అయిపోయినట్లేనా!

-

ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రూల్ పెట్టిన విషయం తెలిసిందే. అశోక్ గజపతి రాజు ఫ్యామిలీ, దివంగత ఎర్రన్నాయుడు ఫ్యామిలీ మినహా మిగతా ఏ కుటుంబానికి బాబు రెండు టికెట్లు ఇవ్వలేదు. దీంతో కొందరు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని రంగంలోకి దింపారు. అలాగే మరికొందరు వారసులని పక్కనబెట్టి, వారే పోటీ చేశారు.

ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉన్న పరిటాల ఫ్యామిలీ నుంచి శ్రీరామ్ బరిలో దిగారు. పరిటాల సునీత బరిలో నుంచి తప్పుకుని శ్రీరామ్‌ని రాప్తాడులో నిలబెట్టారు. కానీ జగన్ వేవ్‌లో శ్రీరామ్ ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయాక శ్రీరామ్ రాప్తాడు బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇదే సమయంలో పరిటాల ఫ్యామిలీకి మరో నియోజకవర్గం కలిసొచ్చింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్ళడంతో, చంద్రబాబు ధర్మవరం బాధ్యతలు కూడా పరిటాల ఫ్యామిలీకి అప్పగించారు.

ఇక అప్పటినుంచి పరిటాల ఫ్యామిలీ రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు చోట్ల పరిటాల ఫ్యామిలీనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సునీతమ్మ, శ్రీరామ్‌లు రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

అందుకే రెండు నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేయడానికి శ్రీరామ్ గట్టిగానే కృషి చేస్తున్నారు. అయితే రాప్తాడులో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఉండగా, ధర్మవరంలో ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఇక వీరికి చెక్ పెట్టి నెక్స్ట్ ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీ రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో టీడీపీని ఎలా గెలిపిస్తుందో చూడాలి. మొత్తానికైతే ఈ రెండు సీట్లు పరిటాల ఫ్యామిలీకి దక్కడం అయితే ఫిక్స్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version