ఆషాడమాసం వచ్చిదంటే చాలు జంటనగరాల్లో బోనాల జోరు సాగుతుంటుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బోనాలు పూర్తిస్థాయిలో జరుగలేదు. భక్తులు కూడా బోనాలకు హాజరయ్యేందుకు సంకోచించారు. అయితే ఈ ఏడాది బోనాలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహముద్ అలీతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అయితే.. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్‌కే పరిమితమైన బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఈ నెల 17న నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు భారీ ఎత్తున ఎక్కడ కూడా తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి తలసాని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా బోనాల ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోందని. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు మంత్రి తలసాని. గతంలో కంటే అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తలసాని స్పష్టం చేశారు. 18న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందని మంత్రి తలసాని వివరించారు.