లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య

-

లాక్ డౌన్, కరోనా ప్రభావం, పెరిగిన ఖర్చులు, మరోవైపు ఆదాయాలు తగ్గడం.. ఇలా ఆకాస్త మొత్తంలో కుటుంబాన్ని నెట్టుకు రావడం కత్తి మీద సామే అవుతుంది. దీంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని యాప్ నిర్వాహకులు ఆసరాగా తీసుకుంటున్నారు. అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ లోన్ యాప్ లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి.

ఈ రుణాలు పొందడానికి వస్తువులు తనకా పెట్టాల్సిన అవసరం కానీ, హామీలు ఇవ్వాల్సిన పనిలేదు. ఇదే ఎక్కువమందిని ఆకర్షించే ఆయుధంగా వినియోగిస్తున్నారు. నిరుపేదల అవసరాన్ని ఆసరాగా తీసుకొని అధిక వడ్డీలు వేసి ముప్పు తిప్పలు పెడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగికి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ (32), రమ్య లక్ష్మి(24) దంపతులు కొంతకాలంగా రాజమహేంద్రవరం లోని శాంతినగర్ లో నివసిస్తున్నారు.

వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం లోని యాప్ లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. అది కాస్త సకాలంలో చెల్లించకపోవడంతో.. వడ్డీ పెరిగిపోవడంతో లోన్ యాప్ కు సంబంధించిన టెలి కలర్స్ తరచూ ఫోన్ చేసి.. మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి, అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం అని బెదిరించేవారు. అంతటితో ఆగకుండా దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పడంతో.. దంపతులు మనస్థాపం చెందారు.

ఈనెల 5వ తేదీన పిల్లలను ఇంటిలో వదిలేసి.. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరి గట్టుపై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి తరలించగా.. బుధవారం ఉదయం దంపతులిద్దరూ మృతి చెందారు. మృతుడి సోదరుడు సోమరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version