union budget 2022 : మాట్లాడండి! పారిపోకండి? ఓవర్ టు వైసీపీ  

-

ప్ర‌స్తుతం పార్ల‌మెంట్లో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి.ఈ స‌మావేశాల్లో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉన్నా వైసీపీ స‌భ్యులు మాత్రం కీల‌కం కాలేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.యూనియ‌న్ బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేటాయించిందేమీ లేద‌ని తేలిపోయింది. రైల్వే ప్రాజెక్టుల‌కు కూడా వీళ్లు ఇచ్చిందేమీ లేద‌ని తేలిపోయింది.అయిన‌ప్ప‌టికీ వైసీపీ పోరు బాట‌లో లేదు. పార్లమెంట్ లోప‌లా మరియు బయ‌టా కూడా నినాదాలు చేసి,నిర‌స‌న‌లు చేసి స‌భ‌ల‌ను అడ్డుకుని త‌మ గొంతుకు వినిపించాల్సిన వైసీపీ ఎంపీలు ఏదో మాట్లాడాలి క‌నుక మాట్లాడుతున్నారే త‌ప్ప పోరాట ప‌టిమ‌ను అయితే ప్ర‌ద‌ర్శించ‌డం లేదు అన్న విమ‌ర్శ‌ల‌ను మోస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి స‌భ్యులు మాత్రం త‌మ‌కేం కావాలో ప‌ట్టుబ‌డుతున్నారు.అటు త‌మ ప్రాంతంలోనూ ఇటు ఢిల్లీలోనూ ఒకే విధంగా పోరాడుతున్నారు.మంచో,చెడో ఏదో ఒక‌టి కేంద్రాన్ని తీవ్ర స్థాయిలోనే నిల‌దీయ‌గ‌లుగుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల‌కు సంబంధించి తాము ఆశించిన నిధులు ఇవ్వ‌లేమ‌ని కేంద్రం చేతులెత్తేస్తే క‌నీసం వైసీపీ త‌ర‌ఫు నుంచి ఎటువంటి స్టేట్మెంట్ లేదు. స‌రిక‌దా బీజేపీకి అనుబంధ పార్టీగా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది.పోల‌వ‌రంవిష‌య‌మై కూడా కేంద్రం ఇస్తున్న‌దేమీ లేదు. ఇది జాతీయ ప్రాజెక్టు క‌నుక కేంద్రం రీయింబ‌ర్స్ చేయాల్సిన నిధులు కూడా స‌కాలంలో అంద‌డం లేదు.

ముఖ్యంగా రైల్వే జోన్ విష‌య‌మై బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజ్య‌స‌భ‌లో అడిగి స‌మాధానం రాబ‌ట్టారే కానీ మ‌న ఎంపీలు మాత్రం దీనిపై నోరెత్త‌లేదు. త్వ‌ర‌లోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుంద‌ని రాజ్య‌స‌భ‌లో కేంద్రం ప్ర‌క‌టించి కాస్తో కూస్తో ఊర‌టనిచ్చింది. ఇదే స‌మ‌యంలో రాజ్య‌స‌భ‌లో ఉన్న వైసీపీ పెద్ద‌లు సాయిరెడ్డి కానీ ప‌రిమ‌ళ్ న‌త్వానీ (రాష్ట్రం త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పెద్దాయన‌) కూడా పెద్ద‌గా ఇక్క‌డి వారి ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతున్న‌దేమీ లేదు. అన్నీ కంటి తుడుపు మాట‌లు మ‌రియు
చ‌ర్య‌లే కానీ వీళ్లు పోరాడుతున్న‌దంతా వ్య‌క్తిగ‌త లాభం కోస‌మే త‌ప్ప ప్రాంతం కోసం కాద‌ని విప‌క్ష నేత రామ్మోహ‌న్ నాయుడు (శ్రీ‌కాకుళం యువ ఎంపీ) మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదాపై కూడా ఏదో అడ‌గాలి క‌నుక
అడిగి వదిలేశారు సాయిరెడ్డి లాంటి పెద్ద‌లు త‌ప్ప కేంద్రాన్ని నిల‌దీసేందుకు మాత్రం ఆస‌క్తి చూపడం లేదు. దీంతో విభ‌జ‌న చ‌ట్టం
ప్ర‌కారం ఆంధ్రాకు ద‌క్కాల్సినవేవీ ద‌క్క‌డం లేదు.

ఇదే స‌మ‌యంలో ఆంధ్రా త‌ర‌పున ఓ సంద‌ర్భంలో క‌విత (అప్ప‌టి ఎంపీ) కొన్ని మాట‌లు మ‌ద్దతుగా చెప్పారు. అదేవిధంగా హ‌రీశ్ రావు ( తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి) కూడా ఆంధ్రాకు మ‌ద్దతు ఇచ్చారు. కానీ విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుపై మాత్రం వైసీపీ మాట్లాడుతున్న‌ది ఏమీ లేదు. పోరాట స్ఫూర్తిలో ఆంధ్రా క‌న్నా తెలంగాణ‌నే ముందున్న‌ది అన్న‌ది మాత్రం ప్ర‌తి పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ సంబంధిత ప్ర‌తి సంద‌ర్భంలోనూ నిరూపితం అవుతూనే ఉంది.అయినా కూడా వైసీపీ ఎంపీలు ప్రాంత ప్ర‌యోజ‌నాల‌పై స్పందించ‌రు. మాట్లాడ‌రు. పోట్లాడ‌రు. వారంతా బీజేపీకి అనుగుణంగా ఉంటూ, ఆంధ్రా ప్ర‌యోజ‌నాల కోసం ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న‌ది తేలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news