ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 403 సీట్లకుగాను ఫిబ్రవరి 10న మొదలుకొని మార్చి 7 వరకు ఏడు ఫేజ్‌లలో ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికలు అధికార బీజేపీకి చావో రేవో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీకి యూపీలో విజయం అత్యవసరం.
ఫిబ్రవరి 7న ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, మొదటి ఫేజ్ కంటే ఫిబ్రవరి 14న జరిగే రెండో ఫేజ్ ఎన్నికలు బీజేపీకి అతి పెద్ద సవాల్‌గా నిలువనున్నాయి.
రెండో ఫేజ్‌లో పశ్చిమ రీజియన్‌లో 55 సీట్లకు ఎన్నికలు జరగనుండగా ఇక్కడ ముస్లింలు, దళితులు జనాభా అత్యధికం. సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్ దల్ కలసి పోటీ చేస్తుండటంతో బీజేపీకి గట్టి సవాల్ ఎదురుకానున్నది.
2017, ఎన్నికల్లో పశ్చిమ యూపీలోని మొరదాబాద్, షహరన్‌పూర్, బిజ్నోర్, అమ్రోహ్ జిల్లాలతోపాటు మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాదౌన్, షాహజహాన్‌పూర్‌లో బీజేపీ అత్యధిక సీట్ల( 55 సీట్లకుగాను 38)లో గెలుపొందింది.
సమాజ్‌వాది పార్టీ 15 సీట్లు, కాంగ్రెస్ 2 విజయం సాధించగా, బీఎస్పీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. మొత్తం 11 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించగా, అందరూ ఎస్పీకి చెందిన వారే.
పోటీ చేసి ఓటమి పాలైన చోట్ల రెండో స్థానంలో ఎస్పీ 27, బీజేపీ 13, బీఎస్పీ 11 స్థానాల్లో నిలిచాయి.
2012లో సమాజ్‌వాది పార్టీ విజయం సాధించినప్పుడు ఈ రీజియన్‌లో 27 సీట్లలో గెలుపొందగా, బీజేపీకి కేవలం ఎనిమిది స్థానాలే దక్కాయి.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమిగా ఏర్పడి పోటీ చేయగా మొత్తం 11 సీట్లకుగాను బీఎస్పీ 4, ఎస్పీ 3 సీట్లలో విజయం సాధించాయి. మొత్తం ఏడు పార్లమెంట్ సీట్ల పరిధిలో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఈ రీజియన్‌లో ముస్లింలు, దళితులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ జాట్లు, ఓబీసీలు అక్కడక్కడ ఉన్నారు. బదౌన్ జిల్లాలో యాదవ్ ప్రాబల్యం ఎక్కువ కాగా, ఇది తొలి నుంచీ ఎస్పీకి కంచుకోటగా ఉన్నది.
పశ్చిమ యూపీలో మతపరమైన పోలరైజేషన్ జరగడం, మోడీ వేవ్ ఉండటంతో గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లలో విజయం సాధించగలిగింది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బీజేపీ పట్ల రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ధాన్యాన్ని సేకరించకపోవడం, సరైన సమయంలో డబ్బులు చెల్లించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
పోలీస్ స్టేషన్ స్థాయిలో తీవ్రమైన అవినీతి కూడా బీజేపీకి చెడ్డపేరు తెచ్చిపెట్టింది.
రాష్ట్రంలో నిరుద్యోగిత భారీగా పెరిగిపోవడం కూడా బీజేపీకి ప్రతికూల వాతావరణం నెలకొనడానికి కారణంగా తెలుస్తున్నది.