కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ)విస్తృతంగా చర్చల్లో నిలుస్తూ వస్తుంది. అయితే ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఉత్తరాఖండ్ కేబినెట్ ఆదివారం ఆమోదించింది. డెహ్రాడూన్లో సీఎం ధామి నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6న బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక దేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.దీనికోసం అసెంబ్లీకి 300 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. వారసత్వం, దత్తత,పెళ్లి, విడాకులు వంటి అంశాల్లో అన్ని మతాలకు ఒకే విధమైన చట్టం తీసుకురావడమే ఈ యూనిఫాం సివిల్ కోడ్ ప్రధాన ఉద్దేశం.
ఉత్తరాఖండ్ బాటలోనే గుజరాత్ కూడా యూనిఫాం సివిల్ కోడ్ ని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందే యూసీసీని అమలు చేసేందుకు గుజరాత్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.