వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై తాజాగా మూడోసారి రాళ్ల దాడి జరిగింది. అసలు విషయంలోకి వెళ్లితే…. గత నెలలో ప్రారంభమైన సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. రైలు ప్రారంభానికి ముందే విశాఖ కంచరపాలెం వద్ద రాళ్ల దాడి జరగ్గా, కొన్ని బోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇటీవల మరోసారి ఖమ్మం జిల్లాలో రాళ్ల దాడి జరగ్గా, ఎమర్జెన్సీ విండో దెబ్బతింది. దాంతో రైలు మూడు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంది. తాజాగా, ఈ రైలుపై మూడోసారి రాళ్ల దాడి జరిగింది.
మహబూబాబాద్-గార్ల స్టేషన్ల మధ్య నేడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. దాంతో ఓ బోగీ (సీ-8 కోచ్) అద్దం ధ్వంసమైంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేడు ముంబయి-షిర్డీ మధ్య ఒక రైలు ముంబయి-షోలాపూర్ మధ్య మరో రైలు కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దేశంలో 10కి పెరిగిన వందేభారత్ రైళ్లు.