ఇవాళ రామతీర్థం వద్ద జరిగిన సంఘటనపై అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లం పల్లి కౌంటర్ ఇచ్చారు. అశోక్ గజపతిరాజుకు ఎక్కడ అవమానం జరిగిందని ప్రశ్నించారు వెల్లంపల్లి. ప్రోటోకాల్ ప్రకారమే అశోక్ గజపతిరాజు ఆహ్వానించామని.. శిలాఫలకంపై పేర్లు వేసే పద్ధతి గత ప్రభుత్వంలో చేయలేదని మండిపడ్డారు. సిస్టం ప్రకారం ఇక్కడ అన్నీ జరుగుతున్నాయని.. ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువా కాదని చెప్పారు. కొండపైన విగ్రహాలు ధ్వంసం అయినప్పుడు, వాటి స్థానంలో మేము వేరే విగ్రహాలు పెట్టి తూతూమంత్రంగా చేతులు దులుపు కోలేదని.. గుడి కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో నాలుగు కోట్ల వ్యయంతో నూతన ఆలయం నిర్మిస్తున్నామని చెప్పారు.
అధికారులు ఆయనకి మర్యాద లు చేయబోతుంటే ఆయనే అడ్డుకున్నారని.. దేవుళ్ళ మీద రాజకీయం చేసే వారిని శ్రీరాముడు శిక్షిస్తాడని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో జరిగిన భూకబ్జాలను తిరిగి రాబడుతున్నామని.. అశోక గజపతి రాజుకు రాజకీయ మనుగడ లేకే ఇటువంటి రాజకీయానికి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీ అని వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నామని.. గత ప్రభుత్వ హయాంలో ఆలయ కర్తగా, మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు ఆలయ అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని మండిపడ్డారు. ప్రోటోకాల్ లో వంశపారపర్యంగా ఇటువంటి గౌరవం ఇవ్వాలో, అటువంటి గౌరవం ఇస్తున్నామని చెప్పారు.