నెల్లూరు జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం మంచి కార్యక్రమం అని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవడం ఎంతో అవసరం అని ఆయన అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం కావడం చాలా మంచిదన్న ఆయన ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరగకుండా ..రాజకీయ నాయకులు.. దళారుల జోక్యం లేకుండా ఉండేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పథకాన్ని ప్రధాని మోడీ తీసుకువచ్చారని అన్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో దసరా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో విద్యా విజ్ఞానం చూస్తుంటే సంతోషంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పిల్లలకు విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పిస్తున్నారని, మహిళలు స్వశక్తితో ఎలా ఎదగాలో స్వర్ణభారత్ ట్రస్టు నేర్పిస్తుందని అన్నారు. రైతులు, పేదలు, విద్యార్థుల కోసం శ్రమిస్తున్న వెంకయ్యనాయుడికి ఆయన అభినందనలు తెలిపారు. అలాగే వెంకయ్య నాయుడు మాట్లాడుతూ…. సంపాదించిన దానిలో కొంత భాగం సమాజానికి ఇవ్వడం జీవితంలో భాగం కావాలన్నారు. ప్రజా సేవ లేని జీవితం వ్యర్థమని ఆయన అన్నారు. అయితే సాధారణంగా వెంకయ్యనాయుడు ఒకప్పుడు బీజేపీ అయినా టీడీపీకి అనుకూలంగా ఉంటారనే ప్రచారం వైసీపీ చేస్తూ ఉండేది. అయితే ఆయన ఉపరాష్ట్రపతి అయ్యాక ఆ ప్రచారం మూలన పడింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై వెంకయ్య ప్రశంసలు