కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ …మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. చిరంజీవి ‘సైరా’లో అతిథి పాత్ర పోషించిన విజయ్..‘ఉప్పెన’ చిత్రంలో విలన్ గా నటించి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.
విజయ్ సేతుపతితో పాటు సూర్య, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. విజయ్ సేతుపతి ఓ వైపు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే ..మరో వైపున తాను హీరోగా మంచి సినిమాలు చేస్తున్నారు.
అలా విజయ్ సేతుపతి నటించిన చిత్రం ‘మామనిదన్’. తెలుగులో ‘మహామనిషి’. కాగా, ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం తాజాగా జరిగింది. దర్శకుడు శ్రీను రామస్వామి, ప్రొడ్యూసర్ ఆర్కే సురేశ్, హీరోయిన్ గాయత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ..విక్రమ్ చిత్రంలో నటించడమే తనకు పెద్ద బహుమతని, అది తన మహా భాగ్యమని చెప్పుకొచ్చారు. ఇక ‘మామనిదన్’ సినిమా విషయానికొస్తే గ్రామీణ నేఫథ్యంలోని అనుబంధాలపైన చక్కటి కథాంశంతో సినిమా తెరకెక్కిందని వివరించారు.
గాయత్రి హీరోయిన్ గా చక్కటి అభినయం కనబర్చిందన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించడం విశేషం. కరోనాతోపాటు ఇతర కారణాల వలన సినిమా విడుదల ఆలస్యమైందని దర్శకుడు, నిర్మాత తెలిపారు.