చిన్నారులతో తిట్టించడం ద్వారా వారి మెదళ్లలో టీడీపీ విషం నింపుతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిర్వహించిన ఆందోళనలో నారా భువనేశ్వరి, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళన సందర్భంగా ఓ చిన్నారికి మైక్ ఇచ్చి మాట్లాడించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన విజయసాయిరెడ్డి టీడీపీపై మండిపడ్డారు. ‘అన్నెం పున్నెం తెలియని పసివాడి చేతికి మైక్ ఇచ్చి పెద్ద మాటలు మాట్లాడించి శునకానందం పొందుతున్నారు టీడీపీ నేతలు. ఈ లోకంలో లేని వైఎస్సార్ గారినీ తిట్టిస్తున్నారు. పసి మెదళ్లలోనూ విషం నింపుతూ పైశాచిక ఆనందం పొందడమేమిటో!’ అని ట్వీట్ చేశారు.
ఇక పోతే, వైసీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందలో భాగంగా… నిన్న (మంగళవారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్… ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ ముఖ్యనేతలు వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురితో భేటీ అయ్యి చర్చలు జరిపారు. పార్టీలోని నేతలందరికీ న్యాయం జరిగేలా… పదవి రాలేదని ఎవరూ బాధపడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. రెండున్నరేళ్ల పదవీ ఫార్ములాను నామినేటెడ్ పదవుల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా అయితేనే.. పార్టీ కొసం పనిచేసేవారందరికీ న్యాయం చేయగలమని.. కొత్తవారికి కూడా అవకాశం కల్పించగలమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.