దేశవ్యాప్తంగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం ప్రవేశపెట్టాలి : విజయసాయి రెడ్డి

-

వైద్య ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్స్‌ విధానాన్ని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద చేపట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. దేశంలో 75 శాతం వైద్య ఆరోగ్య సేవలు కేవలం పట్టణ ప్రాంతంలోనే కేంద్రీకృతం అయ్యాయి. అంటే దేశ జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసించే 27 శాతం ప్రజలకే ఈ వైద్య సేవలు పరిమితం అయ్యాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి వైద్య సేవల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య సేవలను దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది. ఒకప్పటి ఫ్యామిలీ డాక్టర్స్‌ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వైద్య ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురావచ్చని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

YSRCP MP Vijayasai Reddy reinstated as Andhra special representative in  Delhi | The News Minute

ఫ్యామిలీ డాక్టర్స్‌ ద్వారా సాధారణ వైద్య ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానంతో గ్రామీణ ప్రాంతంలో అనేక జబ్బులకు సకాలంలో చికిత్స లభిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్స్‌ రోగులకు నేరుగా చికిత్స అందించడం లేదా మెరగైన చికిత్స కోసం స్పెషలిస్టు డాక్టర్లకు సిఫార్సు చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం కింద గ్రామీణ ప్రాంతాల్లో వైద్య అవసరాలను ఆరంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో వైద్యం కోసం నకిలీ డాక్టర్లపై ఆధారపడే అవసరం తప్పుతుంది. నిక్కచ్చిగా జరిగే రోగ నిర్ధారణ పరీక్షల వలన ఆస్పత్రుల్లో చేరే అవసరం కూడా గణనీయంగా తగ్గుతుంది. అలాగే జిల్లా ఆస్పత్రులపై వత్తిడి, పని భారంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ఒక ఉదాహరణగా నిలిచిందని విజయసాయి రెడ్డి అన్నారు. ఎంపిక చేసిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నదని చెప్పారు. భారతీయులందరికీ వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి వైద్య ఆరోగ్య సేవలను విస్తరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news