వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదరుగా వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు, జగన్‌కు మధ్య గొడవలు ఉన్నాయంటూ.. ఆమె పార్టీకి దూరంగా ఉంటోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలను పటాపంచలు చేస్తూ.. ఎంపీ విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. విజయమ్మ ఈ ప్లీనరీకి వస్తారో, రారో అని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు విజయసాయిరెడ్డి.
ప్లీనరీ సమావేశాలకు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వస్తున్నారని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. వైసీపీ ప్లీనరీకి స్పెషల్ గెస్టులుగా ఎవరినీ పిలవడం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్లీనరీలో పార్టీ పరమైన తీర్మానాలు, పలు అభివృద్ధి పథకాలపై తీర్మానాలకు ఆమోదం తెలుపుతామని వెల్లడించారు విజయసాయిరెడ్డి. తమ ప్రభుత్వ పథకాలను, ఇప్పటివరకు చేసిన, ఇకపై చేయబోయే మంచిని కూడా ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు వివరిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.