వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గత టీడీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారా లోకేశ్ చెబుతున్నాడని, కానీ గతంలో టీడీపీ పాలనలో ఒక కులం, ఒక కుటుంబం, ఒక జిల్లాలోనే అభివృద్ధి జరిగిందన్న విషయం అందరికీ తెలుసని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వాటి కాగితం విలువ కూడా చేయవని విజయసాయి విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. గత వారం విశాఖకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. విశాఖలో 41 లక్షల జనాభా నివసిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 76.9కి.మీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించిందని గుర్తు చేశారు. రానున్న బడ్జెట్లో మెట్రో రైలుతో పాటు, విశాఖపట్నం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్కు విజయసాయిరెడ్డి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు పలు బడ్జెట్లు ప్రవేశపెట్టానని, ఏ బడ్జెట్ లోనూ మధ్యతరగతి వారిపై పన్నులు వేయలేదని స్పష్టం చేశారు. మధ్యతరగతి ప్రజల కష్టాలు తనకు తెలుసని, తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని ఆమె వెల్లడించారు.