మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాల పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే… ప్రజల్ని మోసగించడానికి ఆయన ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధపడతారని పదేపదే స్పష్టమవుతోందని విజయశాంతి అన్నారు. సారు నాటకాలను 2009 నుంచి జనం చూస్తూనే ఉన్నారని… నాటి ఎన్నికల్లో టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమికి జై కొట్టిన కేసీఆర్… బ్యాలెట్ బాక్సులు తెరవకముందే పంజాబ్ లోని లుథియానాలో జరిగిన భారీ ర్యాలీలో ఎన్డీయేకి సై అన్నారని విమర్శించారు విజయశాంతి.
2014లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ జపం చేసి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తానంటూ వారిని ఊరించి, చివరకు ఝలక్ ఇచ్చారని దుయ్యబట్టారు విజయశాంతి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తాను సీఎం అయ్యాక కూడా తనకు అలవాటైన కప్పదాటుడు వ్యవహారాలు, ఇచ్చిన మాట తప్పడం, చేసిన వాగ్దానాలను మర్చిపోవడం వంటి చర్యలతో గత ఏడేళ్ల పైచిలుకు పాలనాకాలంలో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారని విజయశాంతి అన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, బీజేపీ విజయాల నేపథ్యంలో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన కేసీఆర్ గారికి.. కమలదళం తన పాలనకు చరమగీతం పాడుతుందనే భయం పట్టుకుందని అన్నారు విజయశాంతి.