తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. నేటి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇన్నాళ్లు వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం పూట అనుమతించే విధానాన్ని రద్దుచేశారు. నేటి నుండి ప్రయోగాత్మకంగా శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇకనుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్చబోతున్నారు. సర్వదర్శనంకోసం గంటల తరబడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం పూట త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీఐపీల సిఫార్సు లెటర్లపై దర్శన టిక్కెట్లను ఏరోజుకు ఆరోజు మంజూరు చేసేవిధంగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
ఇన్నాళ్లు ఎదురైన ఇబ్బందులు ఈ విధానంతో తగ్గుముఖంపడుతుందని టీటీడీ అధికారు విశ్వసిస్తున్నారు. తిరుమలలో యాత్రికులు గదులకోసం పడే ఇబ్బందులుసైతం తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిన్నటి నుంచే శ్రీవాణి ట్రస్టు దాతలకోసం తిరుపతిమాధవంలో ప్రత్యేక కౌంటర్ ప్రారంభించారు. పదివేలరూపాయల విరాళం ఇచ్చే ఒక్కోదాతకు ప్రత్యేక దర్శనం, బసవసతి కల్పించే విధంగా టిక్కెట్లను మంజూరు చేస్తారు. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో నిన్న ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. శ్రీవాణి ట్రస్టు దాతలకు తిరుపతిలోనే గదులు కేటాయించేవిధంగా చర్యలు తీసుకున్నారు.