రాష్ట్రంలో పేద దళితులకు ఇస్తున్న దళిత బంధు పథకం పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంలో ఎమ్మెల్యే సిఫార్సు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలలో రాజకీయ జోక్యం ఉండకూడదు అని తేల్చి చెప్పింది. లబ్ధిదారుడి అర్హత మేరకు పథకానికి ఎంపిక చేయాలని చెప్పింది. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఎమ్మెల్యేలు ఎవరని హైకోర్టు ప్రశ్నించింది.
అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కమిటీ మాత్రమే దరఖాస్తులను పరిశీలించాలని సూచించడం హర్షనీయమన్నారు. కమిటీల్లో పూర్తిగా అధికారులే ఉండాలని చెప్పారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చౌకబారు రాజకీయ లాభాల కోసం దళిత బంధు లాంటి పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు ఉత్తంకుమార్ రెడ్డి.