హిందూ దేవుళ్ళు, అయ్యప్ప స్వామిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అనే వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హిందూ దేవతలపై అసభ్యంగా మాట్లాడే వారిపై చర్యలు ఏవి? అని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను తిట్టే మునావర్ ఫరుకి వాళ్లకు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందా? అలాంటి వాళ్ల మీటింగులకు పర్మిషన్లు ఇస్తుందా? నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిజమైన హిందువునని చెప్పుకునే కెసిఆర్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఇక అటు కోస్గిలో అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అనే వ్యక్తిపై అయ్యప్ప స్వాములు దాడి చేశారు. నరేష్ ని రోడ్డుపై పరిగెత్తించుకుంటూ కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అయ్యప్ప స్వాములను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. బైరి నరేష్ పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.