ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్య స్వామినాథన్ ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. నవంబర్ 30న చీఫ్ సైంటిస్ట్ పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత భారత్‌కు రావాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.
63 ఏళ్ల వయసున్న సౌమ్య స్వామినాథన్ డబ్ల్యూహెచ్‌ఓలో ఇప్పటివరకు ఐదేళ్లపాటు పనిచేశారు. పదవీ విరమణకు ఇంకా సమయం ఉన్నా రెండేళ్ల ముందస్తుగానే చీఫ్ సైంటిస్ట్ పదవికి రాజీనామా చేయనున్నారు. కొన్ని ఆచరణీయ కార్యక్రమాలపై విస్తృతంగా పనిచేయాలని భావిస్తున్నానని.. భారత్‌లోనే ఉంటూ తన సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఓ జాతీయ వార్తా పత్రికతో సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.
‘అంతర్జాతీయ స్థాయిలో ఐదేళ్లపాటు పనిచేసిన అనంతరం.. భారత్‌కు వచ్చి పరిశోధన, విధానపరమైన అంశాలపై పనిచేయాలని భావిస్తున్నా. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టే వివిధ ఆలోచనలు, ప్రణాళికలను ఆచరణలోకి తీసుకురావాలని కోరుకుంటున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది నిపుణులతో అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే అవకాశం వచ్చింది. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతోన్న భారత్‌లో.. వీటిని అమలు చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. విదేశాల్లో పనిచేయాల్సి వచ్చినప్పటికీ అది కొంత సమయం మాత్రమే. భారత్‌కు వచ్చి అక్కడే ఉంటూ నా సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నా’ అని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు.