కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో కరోనా టీకాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నాలుగు నుంచి ఆరు నెలలకు ఒక కొత్త కరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి, బూస్టర్ షాట్ వేసుకోవాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు. బలహీనులకు.. అంటే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు తప్పకుండా మూడో డోసు వేసుకోవాలని వివరించారు. కరిగిపోతున్న రోగ నిరోధక శక్తిని మళ్లీ బలోపేతం చేయడానికి బూసర్ట్ షాట్ చాలా అవసరం అని అన్నారు సౌమ్య స్వామినాథన్. ముఖ్యంగా బలహీనుల్లో అంటే వయోధికులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి చాలా ముఖ్యం అని వివరించారు సౌమ్య స్వామినాథన్.
ప్రతి నాలుగు నుంచి ఆరు నెలల్లో ఒక కొత్త వేవ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఆ వేవ్ తీవ్రత అప్పడు రోగ నిరోధక శక్తి బలహీనంగా ఎంత మంది ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కొన్ని నెలల పాటు కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత తాజాగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూన్ నెల ఆరంభం నుంచి కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నది. ఈ పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ వివరించారు. బీఏ 4, బీఏ 5 వంటి అత్యధిక వేగంగా వ్యాప్తి చెందే సామార్థ్యాలు ఉన్న సబ్ వేరియంట్లు ప్రస్తుతం వ్యాపిస్తున్నాయని తెలిపారు సౌమ్య స్వామినాథన్.
అదే విధంగా, కరోనాను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు, వ్యాధి నిరోధక శక్తులు సన్నగిల్లడం మరో కారణం అని వివరించారు. వీటితోపాటు ప్రజల ప్రవర్తనల్లోనూ వచ్చిన మార్పు మరో కారణం అని తెలిపారు. కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇండోర్‌లలో మాస్కులు ధరించకుండా ప్రజలు గుమిగూడుతున్నారని వివరించారు సౌమ్య స్వామినాథన్.